విశాఖ భూదందా మీద సిట్ నివేదిక కోసం హైకోర్టుకు …?

ఏపీ విభజనకు ముందే విశాఖలో భూముల ధరలు ఒక రేంజిలోకి వెళ్ళిపోయాయి. 2014 తరువాత ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయాయి. అయిదేళ్ల తెలుగుదేశం పాలనలో విశాఖలో భూములకు కొందరు కీలక నాయకులు, పలుకుబడి కలిగిన వారు చాప చుట్టేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దాని మీద విపక్షాలు అన్నీ ఆందోళనలు చేశాక నాటి సీఎం చంద్రబాబు విచారణ కోసం సిట్ ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ సమగ్రంగా విచారించడం ప్రభుత్వానికి నివేదించడం జరిగిపోయింది. కానీ ఆ నివేదిక మాత్రం బయటకు రాలేదు. మరి ఆ నివేదికలో ఏముందో ఎవరికీ తెలియలేదు.

నాడు బడా నేతలు ప్రముఖులు కూడా భూ దందాలలో ఉన్నారని వార్తలు రావడంతో నివేదికను అలా కామప్ చేశారని ప్రచారం సాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత సిట్ నివేదికను బయటపెట్టలేదు. కొత్తగా మరో సిట్ ని నియమించి దర్యాప్తు జరిపించింది. ఆ టైం లో రెండు సార్లు కరోనా కూడా రావడంతో అనుకున్న షెడ్యూల్ లో సిట్ దర్యాప్తు జరగలేదు.

ఆ మీదట సిట్ నివేదిక ఏమైంది అన్నది సైతం ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇపుడు చూస్తే రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. నాయకులు అంతా కలుగులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ మేము అంటున్నారు. దాంతో సిట్ నివేదికలను బయటపెడితే చాలా మంది నాయకులకు రాజకీయ అజ్ఞాతవాసం తప్పదని అంటున్నారు.

ఈ క్రమంలో సిట్ నివేదిక కోసం హై కోర్టుని ఆశ్రయించాలని కొందరు మేధావులతో పాటు, రాజకీయ నేతలు ఆలోచిస్తున్నారు అంటున్నారు. సిట్ నివేదిక బహిర్గతం అయితే చాలా మంది జాతకాలు తారు మారు అవుతాయని అంటున్నారు. తొందరలోనే దీనికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి హైకోర్టులో దాఖలు చేసేందుకు అయితే రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ఇది ఏపీలో బలమైన పార్టీలలో ఏ వైపున గట్టిగా తగులుతుందో చూడాలని అంటున్నారు.

Leave a Comment