సాకు కోసం వైసీపీ అసంతృప్తుల ఎదురు చూపు!

ఏ ప్ర‌భుత్వ‌మైనా, పార్టీ అయినా అంద‌రికీ న్యాయం చేయడం సాధ్యం కాదు. కనీసం త‌మ వాళ్ల కోసం ఏదైనా చేయాల‌న్న ప్ర‌య‌త్నం కూడా లేక‌పోతే అసంతృప్తికి చోటు ఇచ్చిన‌ట్టే. ప్ర‌స్తుతం వైసీపీలో నిర‌స‌న గ‌ళాలు వినిపించ‌డానికి కార‌ణాలేవో తెలియ‌న‌వి కావు. క‌నీసం త‌మ గోడు వినే నాథుడే క‌రువ‌య్యార‌నేది ఎమ్మెల్యేలు మొద‌లుకుని కార్య‌క‌ర్త వ‌ర‌కూ ఒక‌టే మాట‌. సీఎం జ‌గ‌న్ త‌న‌కు ఐదేళ్ల ప‌ద‌వీ కాలానికే ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌నే సంగ‌తి మ‌రిచిపోయిన‌ట్టున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి పార్టీ స‌మావేశాలు నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవు. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ప‌ట్టించుకున్న వారే లేరు. దీంతో వారిలో గూడు క‌ట్టుకున్న అసంతృప్తి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బ‌య‌ట ప‌డుతోంది. వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో సొంత ప్ర‌భుత్వం, పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త వుందో… ఇటీవ‌ల మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మే నిద‌ర్శ‌నం. ఇంత‌కంటే ప్ర‌జానాడి తెలుసుకోడానికి వైసీపీ పెద్ద‌ల‌కు మ‌రో మార్గం లేదు.

ఇప్ప‌టికే వైసీపీపై న‌లుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం వుంది. అయితే అధికార పార్టీని వ్య‌తిరేకించ‌డానికి బ‌ల‌మైన సాకు కోసం ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తిరుమ‌ల‌లో ఈవో ధ‌ర్మారెడ్డి త‌న ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

త‌న బంధువులు, ఇష్ట‌మైన ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ఒక ర‌కంగా, ఇత‌రుల‌కైతే మ‌రో ర‌కంగా ఈవో ప‌క్ష‌పాత ధోర‌ణితో న‌డుచుకుంటున్నార‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఈ విష‌య‌మై సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని కూడా ఆయ‌న అన్నారు. సొంత పార్టీపై అన్నా రాంబాబు  తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తిరుమ‌ల ద‌ర్శ‌నాల విష‌యంలో త‌న భార్య‌కు ప్రొటోకాల్ ఇవ్వ‌క‌పోవ‌డం ఆయ‌న్ను హ‌ర్ట్ చేసింది. దీంతో ఈవోపై త‌న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి వెనుకాడ‌డం లేదు. దీని వెనుక మ‌రో కార‌ణం కూడా లేకపోలేదు.

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి ఒంటెత్తు పోక‌డ‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో తీవ్ర‌మైన కోపం వుంది. త‌మ‌కు క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌ర‌నేది వారి ఆవేద‌న‌. అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల విష‌యంలో లెక్క‌లేని త‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే ఆగ్ర‌హం చాలా మందిలో వుంది. ఈవోను టార్గెట్ చేయ‌డం ద్వారా త‌న పార్టీలోని అంద‌రి మ‌ద్ద‌తు పొందొచ్చ‌ని అన్నా రాంబాబు వ్యూహాత్మ‌కంగా మాట్లాడారు. గిద్ద‌లూరు ఎమ్మెల్యే ఇప్పుడు ఓపెన్ అయ్యారు. మిగిలిన చాలా మంది కాలేదు.

Leave a Comment